ఎడారిలో సెలయేర్లు - సెప్టెంబర్ 18
దేవోక్తి (దర్శనము) లేనియెడల జనులు కట్టులేక తిరుగుదురు_ (సామెతలు 29:18).
📖దేవుని దర్శనాన్ని పొందాలంటే ఆయన కోసం కనిపెట్టాలి. ఎంత సమయం కనిపెట్టాలి అన్నది చాలా ముఖ్యం.
👉 మన హృదయాలు కెమెరాల్లో వాడే ఫిల్ముల్లాటివి. దేవుని పోలిక అక్కడ ముద్రించబడాలంటే మనం ఆయన ఎదుటికి వచ్చి కనిపెట్టాలి. అల్లకల్లోలంగా ఉన్న సరస్సులో ప్రతిబింబాలు కనిపించవు.
మనం దేవుణ్ణి చూడగలిగితే మన జీవితాలు విశ్రాంతిమయంగా ఉంటాయి. కొన్ని దృశ్యాలను చూడడంలోనే పరివర్తనం చెందించే శక్తి గోచరమౌతూ ఉంటుంది. ఉదాహరణకి, నిశ్చలమైన సూర్యాస్తమయ దృశ్యం మనస్సుకు శాంతినిస్తుంది. అలాగే దేవుని దర్శనం మానవ జీవితాలను మార్చివేస్తుంది.
👉 యాకోబు యబ్బోకు రేవు దగ్గర దేవుణ్ణి చూసి ఇశ్రాయేలుగా మారాడు.
👉దైవ దర్శనం ఆనాడు గిద్యోనుకు పిరికితనం పోగొట్టి శౌర్యాన్ని అలవరచింది.
👉 క్రీస్తు దర్శనం తోమాను అనుమానాలనుండి విముక్తుణ్ణి చేసి నమ్మకస్థుడైన శిష్యుడిగా మార్చింది.
బైబిలు కాలంనుండి దైవదర్శనాలు కలుగుతూనే ఉన్నాయి. విలియం కేరీ తన చెప్పులు కుట్టుకునే వృత్తిలో ఉంటూ దేవుణ్ణి చూశాడు. అతడు బయలుదేరి భారతదేశానికి వెళ్ళాడు.
డేవిడ్ లివింగ్ స్టన్ దైవదర్శనం పొంది దేవునితో కలిసి ఆఫ్రికా ఖండపు చీకటి అరణ్యాల్లోకి వెళ్ళాడు. వందలకొద్ది మనుష్యులు దేవుని దర్శనాన్ని పొంది ఇప్పుడు ప్రపంచపు నలుమూలల క్రైస్తవేతరులకు సువార్తనందించే పనిమీద తిరుగుతున్నారు.
👉 ఆత్మలో ఎల్లప్పుడూ పూర్తి నిశ్శబ్దం ఉండదు. దేవుడు మన ఆత్మలో మెల్లని స్వరంతో పలుకుతూనే ఉంటాడు.
👉 ఆత్మలో ఇహలోక విషయాల రణగొణధ్వని నిశ్శబ్దమైనప్పుడు దేవుని స్వరాన్ని వినగలం. నిజానికి ఆయన నిత్యమూ మాట్లాడుతూనే ఉన్నాడు. మనమే మనచుట్టూ ఉన్న శబ్దాలవల్ల, హడావుడి వల్ల, అవరోధాలవల్ల వినిపించుకోము.
మౌనమావరించినవేళ పలుకు ప్రభూ హృదయపు శబ్దాలను నిమ్మళింపజేసి ఆశతో నీ పలుకుకై వేచి ఉన్నాను
ఈ విశ్రాంతి ఘడియలో పలుకు నా నాథా నీ ముఖారవిందాన్ని చూడనియ్యి నన్ను నీ శక్తితో స్పృశించు నన్ను
నీ నోటి మాటలు నాకు జీవం కదా తండ్రీ పరలోకపు పరమ భోజనమే కదా నా ఆత్మ ఆకలిని చల్లార్చు దేవా
పలుకు ప్రభూ నీ సేవకుడు వింటున్నాడు మౌనంగా ఉండకు, నీ మాటకోసం ఆశతో నా ఆత్మ ఎదురు చూస్తున్నది