ఎడారిలో సెలయేర్లు - సెప్టెంబర్ 17

సెలవిచ్చినవాడు యెహోవా; తన దృష్టికి అనుకూలమైనదానిని ఆయన చేయును గాక అనెను_ (1 సమూ 3:18).

👉 అన్నింటిలోనూ దేవుని హస్తాన్ని చూడడం నేర్చుకోవాలి.

📖అలా నేర్చుకున్నప్పుడు నువ్వు చూసే వాటన్నింటినీ దేవుడు చక్కబరచి కంటికి ఇంపుగా కనబడేలా చేస్తాడు.

👉 మన విచారానికి మూలమైన స్థితిగతులు తొలగిపోవడం జరగకపోవచ్చుగాని,

  • 🔹 మన జీవితానికి కర్తయైన క్రీస్తు మన దుఃఖంలో, వేదనలో భాగస్వామి అయితే మన చేత విమోచన గీతాలాపన చేయిస్తాడు.

  • 🔹 ఆయన పై కన్నులుంచి, ఆయన ఆలోచన వ్యర్థం కాదని ఎరిగి ఆయన శక్తి విఫలం కాదని తెలుసుకొని,

  • 🔹ఆయన ప్రేమ తగ్గిపోదన్న నమ్మకం కలిగి, ఆయన మనకు విధించే యాతనకరమైన పరీక్షలన్నీ మనకు లోతైన ఆత్మానుభవం అలవడడానికే అని గ్రహించగలిగితే మనకు ఎడబాటు, వేదన, బాధ, నష్టం కలిగిన సమయాల్లో మనం అనగలం “దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. ఆయనకు స్తోత్రాలు”

ప్రతిదానిలోనూ ఆయన హస్తాన్ని చూడగలిగినప్పుడే మనలను వేధించే వారి పట్ల మనం ఓపికతో ప్రవర్తించగలం. దేవుని ప్రేమపూర్వకమైన, జ్ఞానయుక్తమైన సంకల్పాలు మనపట్ల నెరవేరడానికి వారంతా ఆయన చేతి పరికరాలుగా వారిని గుర్తిస్తాం.

👉 మనలో మనం అలాంటివారి గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాం. మనలో చెలరేగే తిరుగుబాటు ఆలోచనలను మరి ఏ ఉపాయం చేతా అరికట్టడం సాధ్యం కాదు.

నిద్రరాక తలపులు నెమరేసుకుంటూ క్రొత్త ఆలోచన ఏదన్నా ఇమ్మని అడిగాను ఆత్మల ఊరటకు ఒక దివ్యౌషధం పైనున్న వాటిని వివరించి చెప్పే విలువైన మార్గం

ప్రేమించడానికీ సేవించడానికీ మనుషుల్ని ప్రోత్సహించే పవిత్రభావం స్వార్థాన్ని పరిహరించి పాపాన్ని పరుగులెత్తించే పరమ పథం

మోకాళ్ళూని ఆయన ముందు ప్రార్థిస్తే ఆ నవ్యభావన నాలోకి నిండుగా వచ్చింది సర్వజ్ఞుడైన దేవుడు అంతా వివరించాడు చిన్నవీ పెద్దవి అన్నిటిలో దేవుని హస్తాన్ని చూడు అంటూ ఏది ఎలా జరిగినా ఆయన్ను స్తుతించు బాధలో ఆనందంలో చావులో బ్రతుకులో దేవుణ్ణి చూడు విజయం సాధించు

  • 🔸ఉదయకాంతిలో దేవుణ్ణి చూశాను. దాన్ని ప్రకాశమానంగా వెలిగేలా ఆయన చేశాడు.

  • 🔸మధ్యాహ్నపు ఎండలో దేవుణ్ణి చూశాను. వెచ్చదనంలో దేవుని ఆదరణ అనుభవించాను.

  • 🔸 ప్రొద్దు వాలినప్పుడు అలసటలో, నలిగిపోయి, అర్ధరాత్రి పడకమీద నిద్ర రాక దొర్లుతూ ఆయన వైపే చూశాను. ఆయనే నాకు విశ్రాంతిని ఇచ్చాడు.

  • 🔸 గొప్ప నష్టం సంభవించినప్పుడు ఆయన్నే చూశాను. నాకు నష్టాన్ని కలిగించినప్పటికీ ఆయన నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడని గ్రహించాను.

పెద్ద పెద్ద బరువులు మొయ్యవలసి వచ్చినప్పుడు ఆయన వాటిని తేలిక చేశాడు. రోగం, విచారం, బాధలో నా మనసును ఓదార్చి విశ్రాంతినిచ్చాడు.

👉 నా హృదయాన్ని సంతోష స్తోత్ర గానాలతో నింపాడు. ఈ అనుభవం కొందరికి క్రొత్తగాని నాకు అలవాటే. నేను అలవాటుగా నడిచే దారి ఇది.

అనుదిన జీవితంలో విశ్వాసం ద్వారా తప్ప ప్రత్యక్షమైన వాటిని చూసి ఆదరణ పొందకూడదు. అన్నిటిలోనూ దేవుణ్ణి చూడగలిగితే జీవితం నిజంగా ఆశీర్వాదకరంగా అవుతుంది.

🙏 దైవాశ్శీసులు!!!
✍️ ▪ సంకలనం - చార్లెస్ ఇ. కౌమన్
🌐 ▪ అనువాదం - డా. జోబ్ సుదర్శన్