ఎడారిలో సెలయేర్లు - సెప్టెంబర్ 14

నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ యెత్తికొని నన్నువెంబడింపవలెను_ (మార్కు 8:34).

దేవుడు నన్ను భుజాన వేసుకోమన్న సిలువ అనేక రకాలైన ఆకారాలలో ఉండవచ్చు.

  • 🔹 ఇంకా ఘనమైన సేవ చెయ్యడానికి నాకు సామర్థ్యం ఉన్నప్పటికీ తక్కువ పరిధిలో ఏదో అల్పమైన సేవ చెయ్యడానికి మాత్రమే నాకు అవకాశం దొరకవచ్చు.

  • 🔹ఫలితం ఇవ్వని పొలాన్నే సంవత్సరం తరువాత సంవత్సరం పండిస్తూ ఉండవలసి రావచ్చు.

  • 🔹నాకు కీడును చేసిన వాళ్ళ గురించి ప్రేమ, దయగల ఆలోచనలే తప్ప వేరే విధంగా ఆలోచించకూడదని ఆజ్ఞ రావచ్చు. అలాటి వాళ్ళతో మృదువుగా మాట్లాడి వాళ్ళకు సహాయం చేయవలసి రావచ్చు.

  • 🔹దేవుని గురించి వినడం అనేదాన్ని ఇష్టపడనివాళ్ళ దగ్గరే ఆయన మాటలు పదేపదే చెప్పవలసి రావచ్చు.

👉 సిలువలు చాలా రకాలు. అన్నీ అతి భారమైనవి. నా ఇష్టప్రకారమైతే వాటిల్లో దేన్నీ ఎంచుకోను. కాని నేను సిలువను ఎత్తుకొని సహనంతో సణుగుడు లేకుండా నా భుజం మీద దాన్ని మోసినప్పుడే యేసు నాకు సమీపంగా ఉంటాడు.

📖ఆయన నన్ను సమీపించి నా జ్ఞానాన్ని పరిపక్వం చేసి, నాలో శాంతిని నింపి, నా ధైర్యాన్ని పెంచి, కష్టమైనా, నిష్టూరమైనా నాలోని శక్తి ఇతరులకు ఉపయోగపడేలా చేస్తాడు.

👉 నీ సిలువ నీ చేతికర్రగా ఉపయోగపడేలా చేసుకో. నిన్ను భారంతో నేలకు అణగద్రొక్కే బరువుగా కాదు.

సంతోషంగా నీ సిలువను మోసావంటే నిరాశ, నిస్పృహలనుండి నీ తోటివారిని విడిపించగలవు.

🙏 దైవాశ్శీసులు!!!
✍️ ▪ సంకలనం - చార్లెస్ ఇ. కౌమన్
🌐 ▪ అనువాదం - డా. జోబ్ సుదర్శన్