ఎడారిలో సెలయేర్లు - అక్టోబర్ 22

మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు, ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను_ (నిర్గమ 3:1,2).

ఎప్పటిలాగానే కాయకష్టం చేసుకునే వేళ దర్శనం వచ్చింది. ఇలాటి సమయాల్లోనే దర్శనమివ్వడం దేవునికి ఇష్టం. తన దారిన పోతూ ఉన్న మనిషిని దేవుడు ఎన్నుకుంటాడు. అతని ఎదుట దేవుని అగ్ని సాక్షాత్కరిస్తుంది. అనుదిన జీవితపు కష్టాల్లోనే కృపా సామ్రాజ్యం ఎదురవుతుంది.

📖తండ్రియైన దేవా, మామూలు రోడ్డు మీద నీ సన్నిధి కోసం ఎదురు చూసే జ్ఞానాన్ని దయచెయ్యి. ఆశ్చర్య కార్యాల కోసం నేను అడగడం లేదు. దైనందిన విధులు, ఉద్యోగాలలో నాతో సంభాషించు. నేను అలవాటుగా చేసే ప్రయాణాల్లో నాతో కలసి ప్రయాణించు. నా దీన బ్రతుకును నీ సన్నిధితో మార్పునొందించు.

👉 కొందరు క్రైస్తవులనుకుంటారు, తామెప్పుడూ ప్రత్యేకమైన దర్శనాలనూ, అంతులేని ఆనందానుభూతులనూ పొందుతూ ఉండాలేమోనని. ఇది కాదు దేవుని పద్ధతి.

👉 ఉన్నత స్థలాల్లో ఆత్మీయానుభవాలు, అగోచరమైన ప్రపంచాలతో అపూర్వమైన సాంగత్యాలు, ఇవి కాదు దేవుడు చేసిన ప్రమాణాలు.

👉 అనుదిన జీవితంలోనే ఆయనతో సహవాసం మనకు ఉంది. అది చాలు.

రూపాంతరాన్ని కేవలం ముగ్గురు శిష్యులు మాత్రమే చూశారు. ఆ ముగ్గురే గెత్సేమనె యాతననూ చూశారు. ఎవరికీ రూపాంతర పర్వతం మీద శాశ్వతంగా ఉండిపోయే అనుమతి లేదు. లోయలోకి దిగి వచ్చి చెయ్యవలసిన పనులున్నాయి.

యేసు ప్రభువు తన మహిమలో కాదు గాని ఇహలోకపు శ్రమలోనే తన ప్రయోజనాన్ని మనుషులకు కనబరిచాడు, మెస్సియాగా కనిపించాడు.

🙏 దైవాశ్శీసులు!!!
✍️ ▪ సంకలనం - చార్లెస్ ఇ. కౌమన్
🌐 ▪ అనువాదం - డా. జోబ్ సుదర్శన్