ఎడారిలో సెలయేర్లు - అక్టోబర్ 21
భూమి మీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను, చేతిపని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదుము_ (2 కొరింథీ 5:1).
నేను చాలా సంవత్సరాలుగా అద్దెకు ఉన్న ఇంటి యజమాని - ఇంటికి మరమ్మత్తులు ఇక సాధ్యం కావనీ, నేను ఇల్లు ఖాళీ చెయ్యవలసి ఉంటుందనీ చెప్పాడు.
ఈ నోటీసు నాకు అంతగా సంతోషం కలిగించ లేదు. ఎందుకంటే ఈ పరిసరాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇల్లు శిథిలావస్థలో లేకపోయినట్టయితే ఆ ఇల్లు వదిలి వెళ్ళేవాడిని కాను. కాని గాలి వీచినప్పుడెల్లా ఇల్లు కంపిస్తూ ఉండేది. ఖాళీ చేసి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను.
📖మనం ఇల్లు మారదామనుకుంటున్నప్పుడు మన ధ్యాస ఎంత తొందరగా కొత్త ఇంటికి మళ్ళుతుందో గమనించారా. నేను వెళ్ళబోయే ప్రదేశాన్ని గురించి, అక్కడ ఉండేవాటి గురించి అధ్యయనం మొదలు పెట్టాను.
ఆ ప్రదేశం గురించి బాగా తెలిసిన ఒకాయన వచ్చాడు. అది వర్ణించ శక్యం గాని మనోహరమైనదని అతడు చెప్పాడు. అతడు అక్కడ ఉన్నప్పుడు తాను చూచినదాన్ని చెప్పడానికి భాష చాలదు. అక్కడ తన కొరకు ఆస్తిని సంపాదించుకోవడానికి తాను ఇక్కడున్న వాటినన్నిటినీ వదులుకోవలసి వచ్చిందట. త్యాగాలు చెయ్యడానికి కూడా అతడు వెనుకాడ లేదు. నా మీద అచంచలమైన ప్రేమ చూపి ఆ ప్రేమను ఘోర శ్రమల ద్వారా నిరూపించిన మరొక వ్యక్తి నాకు ఆ ప్రదేశం నుండి తియ్యటి పండ్లగుత్తులు పంపించాడు. అవి తిన్న తరువాత ఇక్కడి ఆహారమంతా చప్పగా అనిపించింది.
ఆ ప్రదేశానికి నేనున్న చోటికి మధ్యనున్న నది దాకా రెండు మూడుసార్లు వెళ్ళాను. అవతలి వైపున రాజుగారిని కీర్తిస్తున్న వారితో చేరాలని కోరిక కలిగింది. నా స్నేహితులు చాలామంది అటు వైపుకు దాటారు. వారు అలా వెళ్ళబోయే ముందు నేను కూడా వాళ్ళను కలుస్తానని చెప్పాను.
వాళ్ళు దాటిపోబోయే ముందు వారి ముఖాలపై విరిసే ప్రశాంతమైన చిరునవ్వును నేను చూశాను. చాలాసార్లు ఇక్కడ ఆస్తిని సమకూర్చుకొమ్మని నన్ను అడుగుతుంటారు. కాని “నేను ఈ ప్రదేశం త్వరలో వదిలి వెళ్ళిపోతున్నాను” అని జవాబు చెబుతూ ఉంటాను.
👉 యేసు ప్రభువు గడిపిన అంతిమ దినాల్లో తరచుగా ‘తండ్రి దగ్గరకు వెళ్తున్నాను’ అంటూ ఉండేవాడు.
👉 క్రీస్తు అనుచరులుగా ఇక్కడి మన శ్రమలు, నిరాశల తరువాత ప్రతిఫలం ఉంటుంది. మనం జీవన ఫలం, పరిపూర్ణతల వైపుకి ప్రయాణం చేస్తున్నాం. మనం కూడా తండ్రిని చేరబోతున్నాం.
మన స్వదేశం గురించి మనకిప్పుడంతా అస్పష్టమే. కాని రెండు విషయాలు మాత్రం స్పష్టంగా తెలుసు. అది తండ్రి ఇల్లు. అది దేవుని సన్నిధి. మనమందరం యాత్రికులం. విశ్వాసికి ఇది తెలుసు. అతడు బాటసారే. స్థిర నివాసం అతనికి లేదు.
చిన్నిచిన్ని పక్షులకు దేవుని పై ఎంత నమ్మిక చిత్రమైన పాటలతో సాగుతాయందుకే ఆనందకరమైన విశ్వాసంతో అన్ని కాలాల్లో ఆనంద తీరాలకు ఎగిరిపోతాయి మునుముందుకే.
నిట్టూర్పులు విడిచి పాటలతో పదండి మన కాలాలు దేవుని వశమే మరణానికి జడిసి ఏడ్పులు భయం రోదనలు వదలండి అది మన నెలవుకు ప్రయాణమే.