ఎడారిలో సెలయేర్లు - అక్టోబర్ 20

సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును_ (ఫిలిప్పీ 4:7).

సముద్ర ఉపరితలం అంతా తుఫానులతో, కెరటాలతో అల్లకల్లోలమైపోతూ ఉంటే దాని లోపలి పొరలు మాత్రం ఎప్పుడూ చెక్కుచెదరవు. సముద్రపు లోతుల్ని తోడి అక్కడ పేరుకున్న జంతువుల, మొక్కల అవశేషాలు పైకి తెస్తే అవి కొన్ని వేల సంవత్సరాలనుండీ నిశ్చలంగా ఏమీ కదలిక అనేది లేకుండా ఉన్నాయని అర్థమౌతుంది.

📖దేవుని శాంతి ఈ సముద్రపు పొరలాటిదే. ఇహలోకపు ఆందోళనలకు, బాధలకు అందనంత లోతుగా ఈ నీటి పొరలు ఉంటాయి. దేవుని సన్నిధిలోకి ప్రవేశించినవాడు ఈ ప్రశాంతతలో పాలు పొందుతాడు.

సముద్రంపై పెనుగాలులు రేగుతుంటె కెరటాల భీకర ఘోషతో ఎగిరిపడుతుంటే ఈ అల్లకల్లోలానికి దూరాన అంతర్భాగంలో నిత్య ప్రశాంతత నిమ్మళంగా నివసిస్తుంది.

సముద్రపు లోతులో తుఫాను ఘోష వినబడదు వెండి చిరుగంటలు మ్రోగుతుంటాయి తుఫాను ఎంత భీకరంగా ఉన్నా సడలించ లేదు లోతుల్లో నెలకొన్న సబ్బాతు ప్రశాంతతను.

నీ ప్రేమను రుచి చూసిన హృదయం ప్రశాంతత నెలకొన్న పవిత్రాలయం గోల చేసే బ్రతుకు బాధలన్నీ ఆ మౌన ద్వారం దగ్గర నోరు మూస్తాయి.

దూర దూర తీరాల్లో మౌన గీతాలు మౌనంలో విరిసిన ఆలోచన కలువలు పెనుగాలి ఎంత చెలరేగినా నీలో నివసించే ఆత్మను తాకలేదు.

🙏 దైవాశ్శీసులు!!!
✍️ ▪ సంకలనం - చార్లెస్ ఇ. కౌమన్
🌐 ▪ అనువాదం - డా. జోబ్ సుదర్శన్