ఎడారిలో సెలయేర్లు - నవంబర్ 27

దేవుడు చెప్పిన యే మాటయైనను నిరర్థకము కానేరదు_ (లూకా 1:37).

హిమాలయ పర్వతాల్లో ఎక్కడో పైన ప్రతి యేడూ దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తుంటాడు. మంచు కురిసిన చోట్ల ఐసు గడ్డలు కట్టి మట్టిని గట్టిగా కప్పేసి ఉంటాయి. ఎండ వెలుతురు చలిరాత్రుల వణికింపు ఆ నేలను తాకదు. ఆ మంచు గడ్డలను చీల్చుకుని అత్యంత ఆకర్షణీయమైన పూలు బయటకు వచ్చి వికసిస్తాయి.

గడిచిన ఎండాకాలమంతా ఆ మొక్క నేల మీద పాకుతూ తన ఆకులను, కొమ్మలను వ్యాపింపజేస్తుంది. సూర్యరశ్మినంతా ఆత్రంగా తాగుతుంది. ఆ వేడిమినంతటినీ చలికాలం పొడుగునా తన వేళ్ళలో భద్రంగా దాచుకుంటుంది. వసంతం రాగానే మంచు గడ్డలక్రింద ఉన్న మొక్కల్లో చలనం వస్తుంది. దానిలోనుంచి పుట్టిన వేడి మంచుపొరను కొద్దికొద్దిగా కరిగిస్తూ ఆ మొగ్గ పెరుగుతుంటుంది. ఆ మొగ్గ అలా చొచ్చుకుంటూ వస్తున్నప్పుడు మంచులో చిన్న గాలి ప్రదేశం ఎప్పుడూ ఆ మొగ్గ చుట్టూ ఉంటుంది. మంచుపొరను తొలుచుకుని మొగ్గ బయటకి వచ్చిన తరువాత సూర్యరశ్మిలో ఇది అందంగా వికసిస్తుంది. ఎండలో మంచుగడ్డ తళతళలాడినట్టుగానే ఆ పుష్పపు ముఖ్ మల్ ఎరుపుదనం తళతళ లాడుతుంది.

స్ఫటికంలా, స్వచ్ఛంగా మెరిసే ఈ పువ్వు మన హృదయంతో మాట్లాడినంత స్పష్టంగా వెచ్చని వాతావరణంలో విరగబూసిన బంగారు రంగులపూలు మాట్లాడలేవు. అసాధ్యాలు సాధ్యం కావడాన్ని చూడడానికి మనం కుతూహలపడుతుంటాం. దేవునికి కూడా ఇదే ఇష్టం.

📖చివరిదాకా ఎదుర్కోండి. మానవపరమైన ఆశలు, ప్రయత్నాలన్నీ దేవుని శక్తికి ఆటంకాలే.

ఎదురైన కష్టాలన్నిటినీ పడేసి మూట కట్టండి.మీరు వెయ్యగలిగినన్నిటిని వేసి మోపు కట్టండి.

👉 ఇది అసాధ్యం అనే ప్రసక్తి తేవద్దు. విశ్వాసం దేవునివైపుకి చూస్తుంది. మన దేవుడు అసాధ్యాలకు దేవుడు.

🙏 దైవాశ్శీసులు!!!
✍️ ▪ సంకలనం - చార్లెస్ ఇ. కౌమన్
🌐 ▪ అనువాదం - డా. జోబ్ సుదర్శన్