ఎడారిలో సెలయేర్లు - నవంబర్ 20
కనిపెట్టుకొనువాడు ధన్యుడు_ (దానియేలు 12:12).
📖కనిపెట్టుకొని ఉండడం తేలిక లాగే అనిపించవచ్చు, అయితే క్రైస్తవ సైనికుడు అనేక సంవత్సరాల శిక్షణ తరువాత మాత్రమే నేర్చుకోగలిగిన విన్యాసమిది.
దేవుని యోధులకి నిలబడి ఉండడం కంటే వేగంగా ముందుకి సాగడమే తేలికగా వస్తుంది.
ఎటూ తోచని పరిస్థితులు కొన్ని ఎదురవుతాయి. ప్రభువుని సేవించాలని మనస్పూర్తిగా కంకణం కట్టుకున్న వాళ్ళకి కూడా తాము ఏం చెయ్యాలో అర్థం కాదు.
-
🔹 అప్పుడేం చెయ్యాలి?
-
🔹 చిరాకుతో గంగవెర్రులెత్తిపోవాలా?
-
🔹 పిరికితనంతో పారిపోవాలా, భయంతో తోచిన వైపుకి తిరగాలా, మొండి ధైర్యంతో ముందుకి దూకాలా?
👉 ఇవేవీ కావు. కేవలం నిలిచి కనిపెట్టాలి.
👉 ప్రార్థనలో కనిపెట్టాలి. దేవుని సన్నిధిలో మన పరిస్థితిని వివరించాలి.
👉 నీ కష్టాన్ని చెప్పుకోవాలి. సహాయం చేస్తానన్న ఆయన వాగ్దానం కోసం వేడుకోవాలి.
విశ్వాసంలో వేచియుండు. ఆయనలో నిశ్చలమైన నీ నమ్మకాన్ని ప్రకటించు. అర్ధరాత్రిదాకా నిన్నలాగే ఉంచినా ఆయన మాత్రం తప్పకుండా సరైన సమయంలో వస్తాడన్న నమ్మకముంచు. దర్శనం వస్తుంది. ఇక ఆలస్యం లేదు.
ఓపికతో కనిపెట్టు. ఇశ్రాయేలీయులు మోషేకు విరోధంగా సణిగినట్టు సణగకు. పరిస్థితిని ఉన్నదున్నట్టు స్వీకరించు. దాన్నలాగే నీ హృదయపూర్వకంగా స్వనీతితో కలుషితం కానియ్యకుండా నిబంధనకర్త అయిన దేవుని చేతుల్లో పెట్టి ప్రార్థించు.
“తండ్రీ నా ఇష్టం కాదు, నీ ఇష్ట ప్రకారమే జరగాలి. ఏం చెయ్యాలో నాకు తెలియడం లేదు, ఆఖరు దశకి వచ్చేసాను. అయినా ప్రవాహాన్ని నువ్వు పాయలుగా విడగొట్టేవరకూ కనిపెడతాను. లేక నా శత్రువులను నువ్వు వెనక్కి తరిమే వరకు ఎదురు చూస్తాను. ఎన్ని రోజులు నువ్వు నన్నిలా ఉంచినా ఫర్వాలేదు. ఎందుకంటే ప్రభూ, నీ ఒక్కడి మీదే నా హృదయం ఆశలు పెట్టుకుని ఉంది. నువ్వే నా ఆనందం, నా రక్షణ, నా విమోచన, నా బలమైన కోట అని నా ఆత్మ పూర్తి నమ్మకంతో ఎదురుచూస్తున్నది.”
ఓపికగా ఎదురుచూడు దేవుడాలస్యం చెయ్యడు నీ ఆశయాలు ఆయన చేతిలో ఉన్నాయి ఫలించే వరకు నిరీక్షించు.
నమ్ము ఆశతో నమ్ము దేవుడు సరిచేస్తాడు చిక్కు ముడులు పడిన జీవితం చీకటి బ్రతుకును వెలుగులోకి తెచ్చి పరిష్కరిస్తాడు ఆశలు నిలిపి నమ్మకముంచు.
విశ్రమించు శాంతిలో క్రీస్తు రొమ్మున నీ ఆశయాన్ని ఆయన చెవిలో చెప్పు ఆయన వాటిని ఫలింపజేస్తాడు శాంతితో విశ్రమించు.