ఎడారిలో సెలయేర్లు - నవంబర్ 8
ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని, ప్రార్థన చేయుటకు ఒక కొండ యెక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను; ఆయన వస్త్రములు తెల్లనివై ధగధగ మెరిసెను . . . వారు మేలుకొనినప్పుడు, ఆయన మహిమను.. చూచిరి_ (లూకా 9:28-32). నీ కటాక్షము నా యెడల కలిగిన యెడల.. దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము (నిర్గమ 33:13).
యేసు తన ముగ్గురు శిష్యులను దూరంగా కొండ మీదికి తీసుకొనిపోయి వారిని తనతో సన్నిహిత సహవాసంలోకి తీసుకువచ్చాడు. వారు యేసు మహిమను చూశారు. అక్కడ ఉండడం వారికెంతో శ్రేష్టతరం. తమ ప్రభువుతో ఒంటరిగా కొండమీద ఉన్నవారికి పరలోకం ఇంకెంతో దూరం ఉండదు.
📖ఏకాంత ప్రార్థనలో, ధ్యానంలో తెరిచి ఉన్న పరలోకపు ద్వారాలను చూడలేని వారెవరుంటారు?
ప్రభువుతో ఏకాంత సేవలో ఉన్నప్పుడు శ్వేత కెరటంలాగా లేచే అనుభూతుల్ని, పరలోకపు అనుభవాల వాసనల్నీ రుచి చూడని వారెవరుంటారు?
మన ప్రభువు తన శిష్యులతో ఏకాంతంగా మాట్లాడడానికి రకరకాల సమయాలనూ, స్థలాలను ఎన్నుకుంటూ ఉంటాడు. ఒకసారి హెర్మోను కొండమీద, చాలాసార్లు ఒలీవ కొండమీద ఇలా ఎన్నెన్నో స్థలాలకు తీసుకెళ్తూ ఉండేవాడు.
ప్రతి క్రైస్తవుడికీ ఒలీవ కొండ అనుభవం ఉండాలి.
మనలో చాలామంది పట్టణాలలో నివసించేవాళ్ళం. అస్తమానమూ అనేక ఒత్తిడులకు గురవుతూ ఉంటాము. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పొద్దుపోయేదాకా మనం ఈ సుడిగాలిలోనే తిరుగాడుతుంటాము. ఈ గందర గోళంలో ధ్యానపూర్వకమైన ఒక్క ఆలోచనకీ, ప్రార్థనకీ, మనసు విప్పి దేవునితో సంభాషించడానికి సమయమెక్కడుంది?
👉 బబులోను విగ్రహారాధనలు, అర్చనల గోల మధ్య దానియేలుకు తన గదిలో ఒక ఒలీవ కొండ ఉంది.
👉 యొప్పేలోని ఇంటి పైకప్పు మీద పేతురుకు ఒలీవ కొండ ఉంది.
👉 మార్టిన్ లూథరు విట్టెన్బర్గులోని ఒక మేడగదిలో ఈ ఏకాంతం దొరికింది. దాన్ని ఇప్పటికీ పవిత్రస్థలంగా ఎంచుతారు.
ఒకసారి డాక్టర్ జోసఫ్ పార్కర్ గారన్నారు. “మనం తిరిగి మన దర్శనాలలోకి, పరలోకపు దృశ్యాలను తొంగిచూసే సమయాల్లోకీ, ఉన్నతమైన మహిమ లోకాలనూ, సమృద్ది జీవితాన్ని అనుభవించగలిగే తాదాత్మ్యంలోకి వెళ్ళలేకపోతే మన ఆధ్యాత్మిక జీవితానికి నీళ్ళొదులుకోవలసిందే. మన బలిపీఠం ఒక రాయిలాగా మిగిలిపోతుంది. దాన్ని పరలోకపు అగ్ని దర్శించడం మానుకుంటుంది.” ప్రపంచానికి నేడు కావలసిందేమిటంటే దేవుణ్ణి చూసిన మనుషులు.
👉 దేవునికి సన్నిహితంగా రండి. తమ బోధకుడినీ, ఆయన ఉద్దేశాలనూ అర్థం చేసుకోవడానికి మాటిమాటికీ విఫలులైన యోహాను, యాకోబులనూ, తప్పటడుగులు వేసే పేతురునూ యేసు ఏకాంతంలోకి తీసుకువెళ్ళాడు.
మిమ్మల్మి ఈరోజు ఆయన ఏకాంతంగా కొండమీదికి తీసుకెళ్తాడేమో. ఎందుకు తీసుకెళ్ళకూడదు? మిమ్మల్ని మీరే తగ్గించేసుకుని “ఆ, అలాంటి ఆశ్చర్యకరమైన దర్శనాలు, దేవుని వాక్కులు వచ్చేది ఎవరో కొద్దిమంది భక్తవరేణ్యులకే” అనకండి. మీకోసం కాదని ఎక్కడా రాసి లేదు.