ఎడారిలో సెలయేర్లు - మే 22

ఆయన … నెరవేర్చును (కీర్తన 37:5).

🌐 ▪ అనువాదం - డా. జోబ్ సుదర్శన్

📖“యెహోవా అనే మార్గం మీద పయనించు. ఆయన్ని నమ్ము, ఆయన పనిచేస్తాడు.”

👉 మనం నమ్మినప్పుడు, దేవుడు వెంటనే తన పనిని జరిగిస్తాడన్న సత్యాన్ని మనకి చూపిస్తుందీ వాక్యం.

మన చేతుల్లో ఉన్న భారమంతటినీ ఆయన మీదికి పొరలించు. అది దుఃఖకరమైన సంగతి కావచ్చు, శారీరకావసరం కావచ్చు లేక మనకి ఇష్టులైన వాళ్ళెవరన్నా మారుమనస్సు పొందాలన్న ఆత్రుత కావచ్చు.

👉 ఆయన నెరవేరుస్తాడు, ఎప్పుడు?

ఇప్పుడే ఆయన మన నమ్మకాన్ని శీఘ్రముగా గౌరవిస్తాడన్న సత్యాన్ని మనం గుర్తించక మన చేతులారా వాయిదా వేస్తున్నాము.

ఆయన వెంటనే నెరవేరుస్తాడు. అందుకని ఆయన్ని స్తుతించండి. మనం అలా ఆయన మీద ఆశలు పెట్టుకోవడమే ఆ పని ఆయన నెరవేర్చడానికి ఆయనకి సహాయపడుతుంది. మనకైతే ఆ పని అసాధ్యం. దాని విషయం మనమిక ఏమీ కల్పించుకోము. ఆయనే నెరవేరుస్తాడు.

ఇక ఆ పని విషయంలో నిశ్చింతగా ఉండి, మరిక దాన్లో వేలు పెట్టవద్దు. ఎంత హాయిగా ఉంటుంది! ఆ కష్టం గురించి దేవుడే పాటుపడతాడు.

ఇలా చెయ్యడంవల్ల నాకేం ఫలితం కనిపించడంలేదు అని కొందరనుకోవచ్చు. పర్వాలేదు, ఆయన పనిచేస్తున్నాడు. నీ పని అంతా ఆయన మీదికి నెట్టేసావుగా. నీ విశ్వాసానికి పరీక్ష జరుగుతున్నదేమో. మొత్తానికి ఆయన మాత్రం పనిమీదే ఉన్నాడు, సందేహం లేదు.

🌐 ▪ అనువాదం - డా. జోబ్ సుదర్శన్

👉 ఈ రోజుల్లో ఇది మన స్వానుభవంలోకి రావడంలేదా?

  • 🔹నా చేతిలో ప్రస్తుతం ఉన్న పని, లేక ఈ రోజు నేను చెయ్యవలసిన పని,
  • 🔹 నా తలకి మించిన ఈ పని, చెయ్యగలనులే అనుకొని నా శక్తి సామర్థ్యాల మీద నమ్మకంతో నా నెత్తిన వేసుకున్న పని -

ఈ పనే నేను ఆయనకి అప్పగించి నాకోసం దాన్ని చేసి పెట్టమంటాను. ఇహ చీకు చింతా లేకుండా హాయిగా ఉంటాను. ఆయన చూసుకుంటాడు.

దేవుడు తాను చేసిన నిబంధన ప్రకారం తన పని తాను చేసుకుపోతూ ఉంటాడు. తన చేతిలోకి తీసుకున్న పని ఏదైనాసరే దాన్ని పూర్తి చేస్తాడు.

కాబట్టి గతంలో ఆయన నుండి మనం అనుభవించిన కృప, భవిష్యత్తులోనూ ఇలాగే ఉంటుందన్న హామీ, ఇవి చాలవా, ప్రతి నిత్యమూ ఆయన వైపు చేతులు చాపడానికి?

🙏 దైవాశ్శీసులు!!!
✍️ ▪ సంకలనం - చార్లెస్ ఇ. కౌమన్
🌐 ▪ అనువాదం - డా. జోబ్ సుదర్శన్