ఎడారిలో సెలయేర్లు - మే 17

📖నలువది ఏండ్లయిన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు… దేవదూత అతని కగపడెను.. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను (అపొ.కా. 7:30–34).

ఒక్కోసారి దేవుడు మనల్ని కొంతకాలం పాటు మన పనిలోనుండి ప్రక్కకి తప్పించి, ఊరకుండి, తిరిగి సేవ చెయ్యడం కోసం కొన్ని విషయాలు నేర్చుకొమ్మని ఆదేశిస్తాడు. ఇలా ఎదురుచూస్తున్న కాలం అంతా వ్యర్థమైందని అనుకోవడానికి వీలులేదు.

పూర్వం ఒక రౌతు శత్రువుల బారినుండి తప్పించుకుని పారిపోతూ కొంత సేపటికి తన గుర్రానికి కొత్త నాడాలు కొట్టడం తప్పనిసరి అని గ్రహించాడు. అతని వివేకమేమో ఆలస్యం లేకుండా ముందుకి సాగిపొమ్మని గొడవ చేసింది. అయితే అంతకంటే ఎక్కువైన వివేచనా శక్తేమో కమ్మరి పనివాని కొలిమి దగ్గర ఆగి ఆ నాడా వేయించడమే మంచిదని బోధించింది. వెంట తరిమేవాళ్ళ గుర్రపుడెక్కల చప్పుడు దగ్గరలో వినిపిస్తూనే ఉన్నప్పటికీ కొద్ది నిమిషాలు ఆగి ఆ నాడా కొట్టించేవరకు నిలబడ్డాడు. ఇక శత్రువులు వందగజాల దూరంలోకి వచ్చేసారనగా గుర్రం మీదికి లంఘించి మెరుపులాగా మాయమయ్యాడు. అతను అక్కడ ఆగడంవల్ల అయిన ఆలస్యం అతని వేగాన్ని పెంచిందని అతనికి తెలుసు.

👉 ఎన్నోసార్లు మనం పరుగెత్తాలని ఉవ్విళ్ళూరుతున్నప్పుడు దేవుడు మనల్ని ఆగమంటాడు. తరువాత వచ్చే మజిలీ కోసం ప్రయాణాన్ని జాగ్రత్తగా ఆలోచించుకొని పనిచెయ్యమంటాడు.

ఓర్పుతో ఓపికగా వేచియుండాలి. తరువాతి మెట్టు స్పష్టంగా కనబడేదాకా హృదయపు చెవులకు దేవుని మాటలు ఆహ్వానిస్తూ సాగిపొమ్మనేదాకా.

ఆశతో నిరీక్షణతో వేచియుండాలి. ఆశ అడుగంటనీయక దేవుడే నీకు మార్గదర్శి కనుదృష్టి అయన్నుండి తొలగిపోనీయక

దొరికేదాని కోసం వేచియుండాలి దొరికేది ఒకవేళ ఈ రోజేనేమో భవిష్యత్ ద్వారం దేవుడు తెరిచే క్షణం ఇంకెంతో ఆలస్యం లేదేమో

వేచియుండాలి ఇంకా వేచియుండాలి చాలాసేపు కనిపెట్టాము దేవుడు తన గుప్పిలి విప్పినంత వరకు వేచి ఉండడంలో తప్పులేదు

వేచియుండాలి ఇంకా వేచియుండాలి దేవుడు జాగు చెయ్యడు. ఆయన తలుపు తెరవడం కోసం నేను వేచియున్నట్టాయనకు తెలుసు.

🙏 దైవాశ్శీసులు!!!
✍️ ▪ సంకలనం - చార్లెస్ ఇ. కౌమన్
🌐 ▪ అనువాదం - డా. జోబ్ సుదర్శన్