ఎడారిలో సెలయేర్లు - మే 6

📖యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులుగల వారికి తెలిసియున్నది (కీర్తన 25:14).

దైవ సంకల్పానికి సంబంధించి దేవుని పిల్లలు నేర్చుకోవలసినవెన్నో రహస్యాలు ఉన్నాయి. వారితో ఆయన ప్రవర్తించే తీరు చూసేవారికి కొన్ని సార్లు అర్ధం కానట్టు గానూ, భయంకరమైనది గానూ కనిపించవచ్చు.

👉 మనలో ఉన్న విశ్వాసం అయితే ఇంకా లోతుకి గమనిస్తుంది. “ఇది దేవుని రహస్యం, మీరైతే పైపైనే చూస్తారు, నేనైతే వీటి వెనక దాగున్న పరమార్థాన్ని చూస్తాను” అంటుంది.

ఒక్కోసారి వజ్రాలను అస్తవ్యస్తంగా ఏదో ఒక కాగితంలో పొట్లం కడుతుంటారు, అవి విలువైనవని ఇతరులు గమనించకుండా చెయ్యడానికి. అరణ్యంలో ప్రత్యక్ష గుడారాన్ని కట్టినప్పుడు బయటనుండి చూస్తే దాన్ని కట్టడానికి ఖరీదైన సరుకులేమీ ఉపయోగించలేదు. దాని విలువ అంతా లోపల ఉన్నది. పైకి కనిపించే ఆ పొట్టేలు చర్మం, మేక వెంట్రుకలు లోపల ఉన్న వైభవాన్ని ఎంతమాత్రమూ చూపించడం లేదు.

ప్రియ మిత్రులారా, దేవుడు మీకు ఖరీదైన బహుమతులు పంపించవచ్చు. వాటి మీద చుట్టిన కాగితం మురికిగా, గరుకుగా ఉంటే కంగారు పడకండి. అవి ప్రేమ, జ్ఞానం దేవుని కరుణల ఊటలని ఏమాత్రం సందేహించకుండా నమ్మండి. ఆయన పంపిన వాటిని స్వీకరించి ఆయన మంచితనం మీద నమ్మకం ఉంచినట్టయితే, అంధకారంలో అయినా సరే దేవుని మర్మాలు మనకి తేటతెల్లం అవుతాయి.

మగ్గం తిరగడం మానేదాకా నేతగాని చేతులు ఆగేదాకా వస్త్రంలోని వన్నెలర్థం కావు. పరలోకంలోని పరమ సాలెవాని చేతిలో వెండి, పసిడి దారాలెంత ముఖ్యమో ఆయన సంకల్పం నెరవేరాలంటే నల్లదారాలంతే ముఖ్యం.

క్రీస్తు ఎవర్నయితే మచ్చిక చేసుకుని తన స్వాధీనంలోకి తీసుకుంటాడో అతను పరిస్థితులన్నిటినీ మచ్చిక చేసుకోగల సమర్థుడు.

పరిస్థితులు మిమ్మల్ని అటూ ఇటూ నొక్కి వేధిస్తున్నాయా? దూరంగా నెట్టెయ్యకండి. కుమ్మరివాని చేతులవి. ఆ పరిస్థితుల నుంచి తప్పించుకోవడం వల్ల కాకుండా, క్రమశిక్షణతో భరిస్తే ఆయన పనితనం బయట పడుతుంది.

👉 నిన్నాయన ఘనతకి తగిన పాత్రగా మలచడమే కాదు, నీలో దాక్కుని ఉన్న శక్తి సామర్థ్యాలను బయటికి తేవడం కూడా చేస్తున్నాడు.

🙏 దైవాశ్శీసులు!!!
✍️ ▪ సంకలనం - చార్లెస్ ఇ. కౌమన్
🌐 ▪ అనువాదం - డా. జోబ్ సుదర్శన్