ఎడారిలో సెలయేర్లు - మార్చి 1
📖దేవుని క్రియలను ధ్యానించుము; ఆయన వంకరగా చేసినదానిని ఎవడు చక్కపరచును? (ప్రసంగి 7:13)
👉 దేవుడు ఒక్కోసారి తన భక్తుల్ని గొప్ప ఇక్కట్లపాలు చేసినట్లు అనిపిస్తుంది.
👉 తిరిగి తప్పించుకోలేని వలలోకి వాళ్ళని నడిపించినట్టు,
👉 మానవపరంగా ఏ ఉపాయము పనికిరాని స్థితిని కల్పించినట్టు అనిపిస్తుంది. దేవుని మేఘమే వాళ్ళనక్కడికి నడిపించినట్టు ఉంటుంది. ఒకవేళ నువ్విప్పుడు అలాటి పరిస్థితిలో ఉన్నావేమో.
ఇది చివరిదాకా చాలా అన్యాయంగానూ, ఊహాతీతంగానూ, ఆందోళనాపూరితంగానూ అనిపిస్తుంది.
కాని ఇదంతా న్యాయమే. నిన్నక్కడికి నడిపించిన దేవుని సంకల్పం బయటపడినప్పుడు, ఆయన జ్ఞానం, మనపైగల ప్రేమ బయటపడతాయి.
👉 ఆయనకున్న అపార శక్తి, కృప వెల్లడి కావడానికి ఇలాటి పరిస్థితి ఒక వేదిక.
👉 నిన్నాయన విడిపించడమే కాకుండా నువ్వెప్పుడూ మర్చిపోలేని పాఠాన్ని కూడా నేర్పుతాడు.
తరువాత కాలంలో నీ పాటల్లో, స్తోత్ర గానాల్లో దాన్ని నువ్వు స్మరించుకుంటావు. ఆయన చేసినదాని కోసం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో నీకు తనివి తీరదు.
ఆయన పరిపాలిస్తున్నాడు మనకి చేసినదాన్ని ఆయన వివరించేదాకా వేచి వుందాం
నాకు మసకగా ఉంది కాని ప్రభూ! నీకు స్పష్టమే ఒక రోజు ఇదంతా వివరించి చెప్తావు అంతదాకా ఈ వంకర బాటే నిన్ను హత్తుకునే మార్గమయ్యింది
నా దారులు వంకర చేసావు, అడ్డు కంచెలు వేసావు నీనుండి తొలగిపోయే నా కళ్ళకి గంతలు కట్టావు నన్ను విధేయుడిగా చెయ్యాలని ఇహలోకపు ఆశలనుండి మళ్ళి నిన్నే ప్రేమించాలని
ఈ అర్థంకాని స్థితికోసం ప్రభూ నీకే వందనాలు అర్థంకాని విషయాల్లో నా నమ్మికే నన్ను నిలబెట్టింది ఆ శోధన ఇవ్వడానికి నన్ను యోగ్యుడిగా ఎంచావు నీ సన్నిధిని ఆ శోధనలు నీ చేత్తో నాకు పంచావు.