ఎడారిలో సెలయేర్లు - జూన్ 25
సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము (నిర్గమ 14:15).
ఆ ఇశ్రాయేలీయుల సుదీర్ఘ ప్రయాణాన్ని ఊహించుకోండి.
-
🔹 ఆశ్చర్యంతో నోట మాట రాక స్థంభించిపోయిన తమ తల్లిదండ్రుల్ని చూసి తమ ఆనందాశ్చర్యాలను ప్రదర్శించడానికి జంకుతున్న చిన్న పిల్లలు,
-
🔹చావుకంటే దురదృష్టకరమైన ఆపదనుండి అనుకోని విధంగా తాము తప్పించబడడం చూసి పట్టరాని ఆశ్చర్యంతో గుసగుసలాడుకునే స్త్రీలు,
-
🔹 వాళ్ళ పురుషులేమో ప్రతి అద్భుతకార్యం జరిగినప్పుడూ తాము ఎందుకు మోషేకి వ్యతిరేకంగా గొణుక్కున్నామా అంటూ సిగ్గుతో తలలు వంచుకున్న దృశ్యాలు ఎన్నెన్నో…..
ఆ విస్తారమైన సముద్ర జలాలు గోడగా నిలచిన సంఘటనను మననం చేసుకుంటే కేవలం ఒక్క వ్యక్తి విశ్వాసాన్ని వమ్ము చెయ్యడం ఇష్టంలేక తన చెయ్యిచాపి సముద్రాన్ని చీల్చిన దేవుడిని ధ్యానిస్తే, తనవారి కోసం ఆయన ఏమేమి చేస్తాడో తెలుస్తుంది.
👉 ఆయన ఆజ్ఞాపించిన దాన్ని తు.చ. తప్పకుండా ఆచరించడానికి భయపడవద్దు. మహా ఘోషతో నీ దారికి అడ్డుగా నిలిచిన జలరాశి మిడిసిపాటుకి కలవరపడవద్దు. జలతరంగాల ఘోషపైన, సముద్రాల అలలపైన ప్రభువైన దేవుడు రాజై ఆశీనుడై ఉన్నాడు.
గాలి తుపాను అంటే ఆయన చెంగు రెపరెపలాడడమే, ఆయన దిగి రానున్నాడు, ఆయన సన్నిధి మన మధ్యను పరుచుకోనున్నది అన్న సంకేతమే.
ఆయనపై నమ్మకముంచండి. ఆయన్ని అనుసరించే ధైర్యాన్ని కలిగి ఉండండి. అప్పుడు మీ అభివృద్ధిని, జీవిత గమనాన్ని నిరోధించిన శక్తులే ఆయన ఆజ్ఞను పొంది మీకు స్వేచ్ఛనిచ్చే సాధనాలుగా మారిపోవడాన్ని చూస్తారు.
ఎర్రసముద్రం ఎదురు నిలిచింది ఏమిచేసినా దారి వదలనంది వెనక్కి తిరిగే వేళ ఇక మించిపోయింది సాగరంలోకి తప్ప మరి దారిలేదంది.
నిబ్బరమైన గుండెలతో నిరీక్షించండి కలవరపు రేయంతా కదలి పోనివ్వండి ప్రచండ వాయువును పంపి దేవుడు జలకుడ్యాలు నిలబెడతాడు నిలిచావేం సాగిపో అని నీ ఆత్మతో అంటాడు
చేయిపట్టి చివరిదాకా చేరుస్తాడు నీటిగోడలు అలా నిలిచే ఉంటాయి పగవాడు రాలేడు, కెరటాలేమీ చేయవు మహా సముద్రం నిన్ను ముంచెత్తదు తరంగాలు తలెత్తవచ్చు. వాటి నురగ బుసలు కొట్టవచ్చు నీ అడుగులైతే ఆరిన నేలమీదే నీ స్తుతి పాట దేవుడు వేసిన బాటలోనే
మేఘం క్రింద ఉదయపు మహిమలో దైవ దర్శనమౌతుంది. సముద్ర తీరాలనుంచి సాగిపోయి గతంలో నీవెప్పుడూ చూడని హితమైన దేశానికి వస్తావు నిన్ను తరిమిన సైన్యంలాగే నీ భయాలుకూడా సమసిపోతాయి ప్రశస్తమైన చోట ఆయన్ని ప్రసిద్ధి చేస్తావు ఆయన చేతులతో చేసిందే ఆ చోటు.