ఎడారిలో సెలయేర్లు - జూన్ 19

గోధుమలు నలుగును (యెషయా 28:28) స్వేచ్ఛానువాదం.

క్రీస్తు చేతుల్లో నలగనిదే మనమెవరమూ ఈ లోకంలో ఆకలిగొన్న వాళ్ళకి ఆహారం కాలేము.

గోధుమలు నలగాలి. క్రీస్తు ఆశీర్వాదాలు ఒక్కోసారి దుఃఖ కారణలే. అయితే మనతోటివారి జీవితాలను దీవెన హస్తాలతో ముట్టుకోగలగడం కోసం విచారాన్ని భరించడం పెద్ద లెక్కలోనిదేమీ కాదు. ప్రస్తుతం మనకున్న ఆకర్షణీయమైన వస్తువులన్నీ కన్నీళ్ళ ద్వారా, బాధ ద్వారా వచ్చినవే.

తాను ఎన్నుకున్న వాళ్ళకి ఆహారంగా దేవుడు నన్ను చేసాడు. ఆ ఆహారం తన పిల్లల ఆకలి తీర్చడానికి ముక్కలు ముక్కలు కావాల్సి ఉంటే ఆయన నామానికే ఘనత మహిమ కలుగుతుంది.

మనం పూర్తిగా కాలిపోయేదాకా వెలుగునిస్తూనే ఉంటాం. రక్తం చివరి బొట్టు కారేదాకా దీవెన వాక్యాలు పలుకుతాం.

👉 పేదరికం, దురదృష్టం, ఇబ్బంది ఎన్నో జీవితాలకి నైతికమైన ధీరత్వాన్ని, ఆత్మీయ ఔన్యత్యాన్నీ ఆపాదించింది.

👉 క్లిష్ట పరిస్థితి మన శక్తికీ, సహనానికీ పరీక్ష పెడుతుంది.

👉 ఆత్మకున్న అత్యుత్కృష్టమైన లక్షణాలను వెలుగులోకి తెస్తుంది.

పాతకాలపు గడియారాల్లో వేలాడే బరువులే దాన్ని తిరిగేలా చేస్తుంటాయి.

చాలాసార్లు నావలు నౌకాశ్రయానికి చేరడానికి పెనుగాలులే తోడ్పడతాయి.

👉 విశ్వాసం, పరిశుద్ధత రగుల్కోవడానికి సాధనాలుగా దేవుడు బాధల్ని నియమించాడు.

బైబిల్లోని ఒక అతి ప్రాముఖ్యమైన వ్యక్తిని దేవుడు నలిపి పిండిచేసి ఆకలిగా వారికి ఆహారంగా తయారుచేసాడు. ఈ శిక్షణ పొందినందుకే అబ్రాహామును విశ్వాసులకు తండ్రి అన్నారు. ఎందుకంటే శ్రమలోను, విధేయతలోను అందరికంటే ప్రథమ స్థానంలో నిలబడ్డాడు అబ్రాహాము.

దేవుడు యాకోబును ఈ విధంగా నూర్చాడు, నలగ్గొట్టాడు.

యోసేపు పిండి పిండి అయ్యాడు. సింహాసనం ఎక్కడానికి అతడు పోతీఫరు వంటశాలగుండా, చెరసాల గుండా వెళ్ళవలసి వచ్చింది.

దావీదును పక్షిని వేటాడినట్టు వేటాడారు. దెబ్బలు తగిలి, అలిసిపోయి. కాళ్ళలో సత్తువలేక గోధుమలు నలిగినట్లు నలిగిపోయాడు.

పౌలు కూడా ఆ కొరడా దెబ్బలు, రాళ్ళ దెబ్బలు, గాయాలు పొంది ఉండకపోయినట్లయితే అన్యజనులు చాలామందికి ఆత్మీయ ఆహారం దొరికేదికాదు.

👉 నువ్వు యుద్ధం ఎలా చేస్తే ఫలితం అలానే ఉంటుంది. దేవుడు నీకు ప్రత్యేకమైన విపత్తుల్ని ఏర్పాటు చేసాడంటే, ఆయన హృదయంలో కూడా నిన్ను ఓ ప్రత్యేకమైన స్థానంలోనే ఉంచుకున్నాడన్నమాట. ఘోరమైన గాయాలు పొందిన ఆత్మని దేవుడు అతి జాగ్రత్తగా ఎన్నుకున్నాడన్న మాట.

🙏 దైవాశ్శీసులు!!!
✍️ ▪ సంకలనం - చార్లెస్ ఇ. కౌమన్
🌐 ▪ అనువాదం - డా. జోబ్ సుదర్శన్