ఎడారిలో సెలయేర్లు - జూలై 27
నన్ను శోధించుడి (మలాకీ 3:10).
అక్కడ దేవుడు ఏమంటున్నాడు - “నా కుమారుడా, నా పరలోకపు వాకిళ్ళు ఉన్నాయి. అవి ఇంకా పాడైపోలేదు. గతంలోలాగానే గడియలు తేలికగానే తియ్యవచ్చు. అవి తుప్పు పట్టలేదు. ఆ తలుపుల్ని మూసి నా దగ్గర ఉన్నవాటిని దాచిపెట్టుకోవడం కంటే వాటిని బార్లా తెరిచి దీవెనల్ని ధారగా కురిపించడమే నాకిష్టం. మోషే కోసం వాటిని తెరిచాను - ఎర్ర సముద్రం పాయలైంది. యెహోషువా కోసం తెరిచాను - యొర్దాను నది ఆగిపోయింది. గిద్యోను కోసం తెరిచాను - సైన్యాలు పారిపోయాయి. నన్ను తెరవనిస్తే నీకోసం కూడా తెరుస్తాను. తలుపులకి ఇవతలి వైపున గతంలో లాగానే నా పరలోకం నిండా అనేక సంపదలు ఉన్నాయి. కాలువలు, ఊటలు పొర్లిపారుతున్నాయి. ఖజానాలు విలువైన బహుమానాలతో నిండిపోయి ఉన్నాయి. నాదేమీ లేదు, లోపం నీలోనే ఉంది. నేను ఎదురుచూస్తున్నాను. నన్నిప్పుడు శోధించు. నీవైపు నుండి నియమాలన్నింటినీ అనుసరించు. నీ దశమ భాగాలను తీసుకురా. నాకు నా పని చెయ్యడానికి అవకాశమియ్యి.”
మలాకీ 3:10 నుండి మా అమ్మగారు చదివి వినిపించే వాక్యాన్ని నేనెప్పుడూ మర్చిపోలేను. “పదియవభాగమంతయు తీసికొని రండి …” తో మొదలై, “పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను” తో వాక్యం ముగుస్తుంది.
నేను ఎన్ని దీవెనల్ని కుమ్మరిస్తానంటే నీకు స్థలం చాలక ఇబ్బంది పడతావు. మా అమ్మగారి సూత్రం ఇది. “దేవుడు అడిగినవన్నీ ఇచ్చెయ్యి. ఆయన వాగ్దానాలన్నిటినీ తీసుకో.”
మన ప్రార్థనలకు మించి ఆయన సామర్థ్యాలున్నాయి. నా ప్రార్థనల్లో చాలాసార్లు చోటుచేసుకునే నివేదనల గురించి ఆలోచించాను. నేను దేనికోసం అడిగాను ఒక గ్లాసెడు నీళ్ళకోసం అడిగాను. సముద్రం అంతా ఆయన దగ్గర మిగిలిపోయింది. కోటానుకోట్ల నక్షత్రాలు ఆయన దగ్గర ఉన్నాయి. అయితే నేను ఒక్క వెలుగు కిరణమే అడిగాను. నేను ఎంత ఎక్కువ అడిగినా అది ఆయన ఇవ్వగలిగిన దానికి చాలా తక్కువలోనే ఉంది.
విస్తరించిన కృపను కోరాను ప్రతి వాగ్దానం మీదా నా పేరు రాశాను - ఎఫెసీ 1:8-19