ఎడారిలో సెలయేర్లు - జనవరి 13

📖మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము (రోమా 8:37)

👉 ఇది విజయం కంటే ఇంకా ఎక్కువైంది. ఇది ఎంత సంపూర్ణ విజయమంటే మనం ఓటమిని, వినాశనాన్ని తప్పించుకోవడమే గాక, మన శత్రువుల్ని తుడిచిపెట్టేసి, విలువైన దోపుడు సొమ్ము చేజిక్కించుకొని, అసలు ఈ యుద్ధం వచ్చినందుకు దేవునికి కృతజ్ఞత చెప్పేలా చేసే విజయం.

👉 మనం అత్యధిక విజయాన్ని ఎలా పొందగలం?

మనకి వచ్చిన సంఘర్షణ ద్వారా మన విశ్వాసాన్ని కట్టుదిట్టం చేసి, మన ఆత్మీయ వ్యక్తిత్వాన్ని స్థిరపరిచే ఆత్మీయ క్రమశిక్షణను ఈ పోరాటాల మూలంగా పొందగలగాలి.

ఆత్మీయ జీవితంలో మనం వేళ్ళు పాతుకుని వర్ధిల్లాలంటే శోధన అవసరం.

🔺 కొండలోయల్లో వీచే బలమైన గాలి ఆ కొండల్లో పెరిగే దేవదారు వృక్షాల వేళ్ళు లోతుగా పాతుకుపోవడానికి కారణమవుతుంది.

  • 🔹 మన ఆత్మీయ సంఘర్షణలు మన పాలిటి అద్భుత ఆశీర్వాదాలు. మనకి బద్ధశత్రువని మనమనుకునేది నిజానికి దాన్ని ఓడించడానికి మనకి శిక్షణంనిస్తుందన్నమాట.

పురాతన కాలంలో ఫ్రుగియ ప్రాంతంలో ఒక నమ్మకం ఉండేది. వాళ్ళు ఎవరైనా శత్రువుని గెలిచినప్పుడెల్లా గెలిచినవాడు తన చేతితో ఓడిపోయినవాడి బలాన్నంతటినీ తనలోకి పీల్చుకుంటాడట. ఆ విధంగా అతని తేజస్సు, శక్తి పెరుగుతాయట.

అలానే మనమొక శోధనని విజయవంతంగా ఎదుర్కోగలిగితే మన ఆత్మబలం రెట్టింపవుతుంది. ఈ విధంగా మన శత్రువుని ఓడించడమే కాకుండా మన పక్షంగా దానిచేత పనిచేయించుకోవచ్చు.

ఫిలిష్తీయుల భుజాల మీద ఎక్కడం గురించి యెషయా మాట్లాడతాడు (యెషయా 11:14). ఈ ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల బద్ద శత్రువులు. అయితే ఇక్కడ అంటున్నదాని ప్రకారం ఇశ్రాయేలీయులు వాళ్ళని జయంచడమే కాకుండ తమని ఇంకా మిగిలిన విజయాలు పొందడానికి వాహనాలుగా వాళ్ళను ఉపయోగించుకుంటారట.

  • 🔹 తెలివైన నావికుడు గాలివాటును బట్టి తెరచాపనెత్తి ఆ ప్రకృతి శక్తిని తనకనుకూలంగా వినియోగించుకోవడం లాంటిది ఇది.

అలాగే జయాన్ననుగ్రహించే దేవుని కృప మూలంగా మన ఆత్మీయ జీవితాల్లో మనకి విరోధంగా అనిపించేవాటిని అనుకూలంగా మార్చుకోవడం మనకి సాధ్యమే. “నాకు వ్యతిరేకంగా జరిగిన ఈ సంఘటనలు సువార్త వ్యాప్తి కోసమే జరిగాయి” అని ప్రతిసారి చెప్తుండాలి.

🔺 కడుపులో చల్ల కదలకుండా ప్రశాంతంగా బ్రతకగలగడం అనేది క్షేమకర జీవితం అని అందరూ అనుకుంటారు. కాని మహా పురుషులైన వాళ్ళ జీవితాలు ఇందుకు వ్యతిరేకంగా చెపుతున్నాయి.

కష్టాలను భరించగలగడమే మనిషిని ఉన్నతుడుగా చేస్తుంది. కేవలం బ్రతుకు వెళ్ళబుచ్చడానికి, శక్తివంతమైన నిండు బ్రతుకుకీ తేడా ఇదే. కష్టాలు వ్యక్తిత్వాన్ని పెంచుతాయి.

“మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయనయందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము” (2 కొరింథీ 2:14)

🙏 దైవాశ్శీసులు!!!
✍️ ▪ సంకలనం - చార్లెస్ ఇ. కౌమన్
🌐 ▪ అనువాదం - డా. జోబ్ సుదర్శన్