ఎడారిలో సెలయేర్లు - జనవరి 10
📖ఆసియలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారినాటంకపరచినందున… (అపొ.కా. 16:6)
దేవుడు ఆ రోజుల్లో అపొస్తలులను నడిపించిన తీరు చాలా ఆసక్తిదాయకంగా ఉంటుంది. ఈ నడిపింపు ఎక్కువ భాగం అడ్డగింపులతోనే నిండి ఉంది. చాలాసార్లు దారి తప్పుతూ వెళ్ళారు ఈ అపొస్తలులు.
ఎడమవైపుకి తిరిగి బితూనియకు వెళ్తుంటే మళ్ళీ ఆపాడు. తరువాత కాలంలో పౌలు జీవితం మొత్తానికి గర్వించదగ్గ సేవను ఆ ప్రదేశాల్లో చేశాడు.
👉 కాని ఇప్పుడు మాత్రం పరిశుద్ధాత్మ ఆ తలుపుల్ని మూసి ఉంచాడు. సైతాను పదిలంగా కట్టుకొన్న ఆ దుర్భేద్యమైన కోట గోడల్ని కూల్చే సమయం ఇంకా రాలేదు. ఆ పనికోసం అపొల్లో వచ్చి చేరవలసి ఉంది. ఇప్పుడు పౌలు, బర్నబాల అవసరం మరొకచోట ఉంది. ఆసియాలో సువార్త చెప్పడంలాంటి బాధ్యతాయుతమైన పని కోసం వాళ్లకింకా శిక్షణ అవసరం.
👉 నీవు వెళ్ళవలసిన దారి గురించి ఏమన్నా సందేహముంటే దాన్ని వెంటనే ప్రభువుకి అప్పగించు.
వెళ్ళవలసిన ద్వారం తప్ప మిగతా తలుపులన్నింటినీ మూసెయ్యమని ఆయన్నడుగు.
“ఓ పరిశుద్ధాత్మ దేవా, దేవుని చిత్తం కాని దారుల్లో నా అడుగులు పడకుండా ఆ దారులన్నింటినీ మూసేసే బాధ్యత పూర్తిగా నీకే వదులుతున్నాను. నేను కుడి ప్రక్కకైనా ఎడమ ప్రక్కకైనా తిరిగితే నా వెనుకనుండి నీ స్వరం వినిపించు” అంటూ ప్రార్ధించు.
ఈ లోపల నువ్వు నడుస్తున్న దారిలోనే సాగిపో. నీకు అందిన పిలుపుకి లోబడే ఉండు.
పౌలుకి పరిశుద్ధాత్మ దేవుడు మార్గాన్ని ఎలా బోధించాడో నీకు కూడా అదే విధంగా బోధించాలని ఎదురుచూస్తున్నాడు. అయితే అయన నిన్ను ఒక పని చెయ్యనియ్యకుండా ఏ మాత్రం అడ్డుపెట్టినా విధేయుడవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి.
నమ్మకం కలిగి ప్రార్ధన చేసిన తరువాత అడ్డంకులేవి కనిపించని పక్షంలో తేలిక హృదయంతో ముందడుగు వెయ్యి. కొన్ని సార్లు నీ ప్రార్ధనకి జవాబుగా ఒక తలుపు మూసుకుపోతే ఆశ్చర్యపోవద్దు.
ఎడమకి కుడికి వెళ్ళే తలుపులు మూసుకుపోతే త్రోయ ప్రదేశానికి వెళ్ళే తలుపు తెరిచి ఉంటుంది. అక్కడ లూకా మీ కోసం ఎదురుచూస్తున్నాడు. దర్శనాలు మీకు కర్తవ్యాన్ని బోధిస్తాయి. అక్కడ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. స్నేహితులు మీ కోసం ఎదురుచూస్తున్నారు.
నీ జీవితంలో విడదీయరాని చిక్కుందా ఛేదించలేని రహస్యపు దిక్కుందా నిజాలు వెలికి తీసే దేవుడున్నాడు ఆయన చేతిలోనే ఆ తాళముంది
తండ్రిచేత మూయబడిన తలుపు నీ ముందుందా అది తెరుచుకోవాలని నీ అంతరంగం ఉవ్విళ్ళూరుతుందా ఆయనే ఆ తలుపు మూసినవాడు అది తిరిగి తీసేవాడు ఆయనే చూడు
నెమ్మదిగల దేవునిపట్ల ఓర్పుగలిగి ఉండవద్దా?సర్వజ్ఞాని ఆయనేననడానికి అభ్యంతరముందా నీ భవిష్యజ్జీవితం నిర్ణయించినవాడు ఆయనే దాని తలుపుల్ని తెరిచేచాడు
ధన్యకరమైన తాళం చెవి ఆయన దగ్గరుందని గుర్తిస్తే కడకు నీకే అది లభిస్తుంది ధన్యత అనేది ఆదరణ విశ్రాంతిగా మారుతుంది.