ఎడారిలో సెలయేర్లు - జనవరి 8

📖వారిని, నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, దీవెనకరముగు వర్షములు కురియును (యెహెజ్కేలు 34:26)

ఈ వేళ ఏ ఋతువు? అనావృష్టి కాలమా? వర్ష ఋతువు ఇంకెంతో దూరం లేదు. గొప్ప భారంతో కూడిన మబ్బులు కమ్మిన కాలమా? వర్ష ఋతువు వచ్చేసింది.

నీ బలం దిన దినం అభివృద్ది చెందుతుంది. దీవెనకరమైన వర్షాలు కురుస్తాయి. ఇక్కడ బహువచనం ఉంది. అన్నిరకాలైన దీవెనలనూ దేవుడు కురిపిస్తాడు. దేవుని దీవెనలన్నీ కలిసికట్టుగా వస్తాయి.

బంగారు గొలుసులోని లింకుల్లాగే అన్నీ ఒక దాని వెంట ఒకటి వస్తాయి. మారుమనస్సు పొందడానికి ఆయన కృపనిస్తే నిన్ను ఆదరించే కృపలను కూడా ఆయనే ఇస్తాడు.

ఆయన ‘దీవెనకరమైన వర్షాలు’ కురిపిస్తాడు. ఎండిపోయిన మొక్కల్లారా, పైకి చూడండి. మీ ఆకుల్ని, పువ్వుల్ని విప్పండి. పరలోక వర్షాలు మిమ్మల్ని తడుపుతాయి.

దిగుడులోయగా మార్చుకో నీ గుండెను అది నిండి, పొంగి పొర్లేదాకా దేవుడు కురిపిస్తాడు దీవెన వర్షాన్ని

ప్రభూ, నా ముల్లుని నువ్వు పువ్వుగా మార్చగలవు. నా నివేదన ఇదే. యోబు జీవితంలో వర్షం తరువాత ఎండ కాసింది. కాని కురిసిన వర్షం వ్యర్ధం కాలేదుగా.

యోబు అడిగాడు, నేనూ అడుగుతున్నాను. వర్షం తరువాత వచ్చే తళతళలకు, వర్షానికీ సంబంధం లేదా? నువ్వు చెప్పగలవు – నీ శిలువ చెప్పగలదు. నీ బాధల్లో కిరీటం ఉంది. ప్రభూ, ఆ కిరీటం నాకు కావాలి. వర్షం కురిసి వెలసిన తరువాత ఉండే తళతళల్లోని తళుకుని నాకు బోధపరచు. అప్పుడే నేను జయశీలిగా ఉండగలను.

👉 జీవితం ఫలభరితం కావాలంటే సూర్యరశ్మితోబాటు వర్షం కూడా కావాలి.

ఎండి పగులువారిన నేలపై జీవవాయువు పోసే వర్షం కావాలి ఆ వర్షానికి తమ శాఖలు తడిసిపోవచ్చు

ధరణీతలం హరిత శాద్వలంగా మారాలంటే మబ్బు నీళ్ళు కావాల్సిందే !

భయాల మొయిళ్లు బాధల వర్షాన్ని మోసుకొచ్చాయి బ్రతుకు భూమిపై కురిసి గుండెలోతుల్లోకి తేమను తెచ్చాయి

దేవుని దివ్య సూత్రాన్ని ఆచరించగా పగుళ్ళు విచ్చిన దిగుళ్ల నేలలో పచ్చదనం మందహాసం చేసింది

నిన్ను ఆవరించిన ప్రతి కారుమబ్బులో పౌలు రాసిన పవిత్ర వాక్కులు గమనించు

ఈ మేఘాలు నీ ఆత్మకు క్షేమాలు అవి నీకు మేలే చేస్తాయి అది నీవు గుర్తించు.

🙏 దైవాశ్శీసులు!!!
✍️ ▪ సంకలనం - చార్లెస్ ఇ. కౌమన్
🌐 ▪ అనువాదం - డా. జోబ్ సుదర్శన్