ఎడారిలో సెలయేర్లు - ఫిబ్రవరి 29
దోనెను లోతునకు నడిపించి_ . . . (లూకా 5:4).
📖ఎంత లోతుకి అన్నది చెప్పలేదు.
👉 ఎంత లోతుకి నడిపించాలన్నది, మనం ఎంత మనస్ఫూర్తిగా ఒడ్డుని వదిలి వచ్చేసామన్న దాని మీదా, మన అవసరం ఎంతటిది, అన్న దాని మీదా ఆధారపడి ఉంది. చేపలు లోతైన నీటిలోనే ఉంటాయి.
మన విషయంలో కూడా అంతే. దేవుని లోతైన జ్ఞానంలోనే మన అవసరాలు తీరేది. మనం దేవుని వాక్యపు లోతుల్లోకి నావను నడిపించాలి. ఇంతకుముందు వందలసార్లు చదివినా స్పురించని ఆత్మీయ అర్థాలు కోకొల్లలుగా తేటగా తెలియడానికి ఆత్మ దేవుడు మార్గం తెరుస్తాడు.
విమోచన లోతుల్లో క్రీస్తు విలువైన రక్తం, ఆత్మ ప్రకాశంలో మనపాలిట సర్వరోగ నివారిణి అయ్యేదాకా, మనం శరీరానికి, ఆత్మకూ ఆహారంగా, ఔషధంగా మారేదాకా లోతుకి వెళ్ళాలి.
తండ్రి చిత్తం లోతుల్లో దాని శ్రేష్టత. దాని పూర్తి స్వభావమూ, దాని సర్వ వ్యాపకత, మనపట్ల దాని శ్రద్ధ పూర్తిగా మనకర్ధమయ్యేంత లోతుకి వెళ్ళాలి.
మన ప్రార్థనలకి పరిశుద్దాత్మ తానే కాంతివంతం, మధురం అయిన అసమాన సమాధానంగా దిగి వచ్చేదాకా, అత్యంత శ్రద్ధగా మృదువుగా రాబోయే వాటన్నిటినీ ముందే ఊహిస్తూ, సంరక్షిస్తూ, మనకి సంభవించే వాటన్నిటినీ మనకనుకూలంగా మలుస్తూ కొనసాగేటంత లోతుకి మన నావను నడిపించాలి.
దేవుని సంకల్పపు లోతుల్లోకి, ఆయన రాజ్యం , ఆయన వెయ్యేళ్ళ పరిపాలన ఇప్పుడే, ఇక్కడే మనకి అనుభవమయ్యేలా, కాలాతీతమైన అకాల స్వర్గసౌఖ్యంలోకి, మానసిక నేత్రం మిరుమిట్లు గొలిపే దాకా హృదయం రాబోయే వాటిని తలుచుకుని మహానందంతో ఉప్పొంగే దాకా యేసుప్రభువు, ఆయన మహిమ, ఆనందం తేటతెల్లమయ్యే దాకా లోతుకి వెళ్తూనే ఉండాలి.
👉 వీటన్నింటిలోకి మన నావను నడిపించమంటున్నాడు యేసు. మనల్ని, అగాధ జలాల లోతుల్ని చేసిందాయనే. ఆ జలాల లోతుల్లో మన సామర్థ్యాలను, మన ఆశయాలనూ దాచి ఉంచాడు.
దాని ధారలు సర్వవ్యాపకాలు దాని సమృద్ధి అనంతం అందరికి సరిపోతుంది మరిక ఎన్నటికీ కొరతపడదు
👉 పరిశుద్ధాత్మ లోతైన జలాలు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి. ఎందుకంటే అవెప్పుడూ ప్రవహిస్తూనే ఉంటాయి. ఈ జీవజలాల్లో ఈ రోజు మునిగి స్నానం చెయ్యాలని లేదా?
యెహెజ్కేలు కన్న కలలో నీళ్ళు దేవాలయ ద్వారాల క్రిందనుండి వచ్చినాయి. కొలిచే వ్యక్తి ఆ నీటిని కొలిచి చీలమండలదాకా వచ్చినట్టు చూశాడు. మళ్ళీ కొలిస్తే మోకాళ్ళదాకా వచ్చాయి. మళ్ళీ కొలిస్తే మొల లోతు ఉంది. క్రమంగా ఈత కొట్టవలసినంత లోతు అయింది. దాటలేనంత నది అయింది (యెహెజ్కేలు 47).
👉 ఈ జీవనదిలో ఎంత దూరం వెళ్ళాం మనం? అహాన్ని పరిశుద్ధాత్మ పూర్తిగా తుడిచి పెట్టేస్తాడు. చీలమండలు దాకా కాదు, మోకాళ్ళ దాకానో మొలలోతు గానో కాదు. ఈ జీవధారలో మనం మునిగిపోయి స్నానమాడేంతలా పొంగి పారుతుంది. తీరాన్ని వదలండి నావను లోతుకి నడిపించండి, మర్చిపోవద్దు. కొలబద్ద పట్టుకుని కొలిచేవాడు ఈరోజు మనతోనే ఉన్నాడు.