ఎడారిలో సెలయేర్లు - ఫిబ్రవరి 13

📖ఆ కొండ (ప్రాంతము) మీదే (యెహోషువ 17:18).

ఉన్నతమైన ప్రదేశాల్లో నీకు చోటు ఎప్పుడూ ఉంటుంది. 👉 లోయ ప్రాంతాల్లో కనానీయులు ఉన్నప్పుడు, నిన్ను వాళ్ళు తమ ఇనుప రథాలతో అడ్డగించినప్పుడు కొండల పైకి వెళ్ళండి. ఎత్తయిన ప్రదేశాలను ఆక్రమించుకోండి.

👉 దేవుని కోసం నువ్విక పనిచెయ్యలేని సమయం వచ్చేస్తే, పనిచేసే వాళ్ళకోసం ప్రార్థన చెయ్యి.

ఈ లోకాన్ని ప్రసంగాల ద్వారా ఊపెయ్యడం నీకు కుదరకపోతే, నీ ప్రార్ధనద్వారా పరలోకాన్ని ఊపెయ్యి.

పల్లపుభూముల్లో నీ ఉపయోగం లేకపోతే, సేవకి తగిన బలం, ఆర్థిక సహాయం లేకపోతే, నీ చురుకుతనం పైవాటిల్లో, పరలోకంపై ప్రయోగించు.

🔺 విశ్వాసం అరణ్యాలను నరికే శక్తిగలది.

కొండ ప్రాంతాలు నివాసానికి ఎంత శ్రేష్టమైనవో తెలిసినప్పటికీ, అరణ్యాలు నిండిన ఆ కొండల్ని నివాసయోగ్యంగా చెయ్యడానికి, ఆ అడవుల్ని నరకడానికి యోసేపు సంతానానికి ధైర్యం చాలేది కాదు. అయితే దేవుడు వాళ్ళకి అప్పగించాడు. వాళ్ళ శక్తి ఆ పనికి సరిపోతుందన్నాడు.

అరణ్యాలు నిండిన ఆ కొండల్లాగా మనకి దేవుడు కేటాయించే పనులన్నీ అసాధ్యంగానే కనిపిస్తాయి. అవి మనల్ని హేళన చెయ్యడానికి కాదు గాని, మనల్ని ఘన కార్యాలకి పురికొల్పడానికే.

దేవుడు తన సన్నిధి శక్తిని మనలో నింపకపోతే మనకీ కార్యాలు అసాధ్యమే.

👉 విశ్వాస సహిత ప్రార్థనకి జవాబుగా దేవుడు ఏమేమి చెయ్యగలడు అన్నది మనకి తెలియడానికే ఇబ్బందులు వస్తాయి.

👉 లోయలో నువ్వు ఉండలేకపోతున్నావా? కొండల్లోకి వెళ్ళి నివసించు. బండరాళ్ళలో నుండి కొండ తేనే సంపాదించుకో. అరణ్యాలు కప్పిన కొండ చరియలను సస్యశ్యామలం చేసుకో.

మనం దాటలేమనే నదులున్నాయా

తొలచలేమని వదిలేసిన పర్వతాలున్నాయా

అసాధ్యమనుకున్న పనులే మేం చేపట్టేది

చెయ్యలేమన్న వాటినే మేము చేసేది.

🙏 దైవాశ్శీసులు!!!
✍️ ▪ సంకలనం - చార్లెస్ ఇ. కౌమన్
🌐 ▪ అనువాదం - డా. జోబ్ సుదర్శన్