ఎడారిలో సెలయేర్లు - డిసెంబర్ 21

అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించెను గనుక … అతడు అడుగు పెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానమునకును ఇచ్చెదను_ (ద్వితీ 1:36).

నీ దారికి అడ్డంగా ఉన్న ప్రతి ఆటంకమూ, చెయ్యడానికి ఇష్టం లేని ప్రతి పనీ, బాధ, ప్రయత్నం, పెనుగులాటలతో కూడుకున్న ప్రతి విషయమూ నీకోసం ఆశీర్వాదాన్ని దాచిపెట్టి ఉంచింది. ఆ పనిని చెయ్యకపోవడం ఆ దీవెనలను వదులుకున్నట్టే.

📖నీ దేవుని అడుగుజాడలున్న ప్రతి ముళ్ళదారీ, వెంబడించమని ఆదేశించిన ప్రతి కాలిబాటా దీవెన మార్గమే. ఈ ఏటవాలు ముళ్ళబాటలో నువ్వు నడవలేకపోతే నీకు ఆ దీవెనలు దక్కవు.

నువ్వు వెళ్ళే ప్రతి యుద్ధరంగమూ, కత్తిదూసి శత్రువు నెదిరించే ప్రతి సమయమూ విజయవంతమే. నీ జీవితానికి ఆశీర్వాద కారణమే. నువ్వు ఎత్తవలసి వచ్చిన ప్రతి బరువులోనూ అందుకు తగిన బలాన్నిచ్చే గుణం ఉంది.

కెరటాలు ఎగిరెగిరిపడుతున్నాయ్ పొగమంచు కమ్ముకొస్తోంది ఆకాశంలో వెలుగు హరించుకుపోయింది ఒక్కడినే ఏమీ చెయ్యలేను ఇద్దరం కలిస్తే సాధిస్తారు… యేసూ, నేనూ

పిరికివాణ్ణి, దారితప్పిన బలహీనుణ్ణి రంగులు మారే ఆకాశంతో మారిపోయేవాణ్ణి ఈరోజు ఉత్సాహంగా, రేపు నిస్త్రాణంగా ఆయనైతే పట్టు వదలడు ఇద్దరం కలిస్తే గెలుస్తాము… యేసూ, నేనూ

నా జీవిత నావను చెలరేగే సంద్రంలో నాకై నేను నడిపించలేను నా చెంతను ఉన్నారొకరు నాతో కలిసి నడిపించేవాడు ఇద్దరం కలిస్తే నాకు తెలుసు నావను తీరం చేర్చగలమని… యేసూ, నేనూ.

🙏 దైవాశ్శీసులు!!!
✍️ ▪ సంకలనం - చార్లెస్ ఇ. కౌమన్
🌐 ▪ అనువాదం - డా. జోబ్ సుదర్శన్