ఎడారిలో సెలయేర్లు - ఆగస్టు 8
దేవా, నీవే నా రాజు. యాకోబునకు పూర్ణరక్షణ కలుగ నాజ్ఞాపించుము_ (కీర్తనలు 44:4).
నీ రక్షకుడు ఇంతకుముందే ఓడించి లొంగదీయని శత్రువెవడూ లేడు. కృపలో నువ్వు ఎదగడానికి, క్రైస్తవునిగా నీ దేవుని కోసం పాటుబడడానికి ఆటంకపరిచే విరోధులెవరూ నీ ఎదుట నిలువ లేరు.
వారి గురించి నువ్వు భయపడనక్కరలేదు. వాళ్ళంతా నీ ఎదుటనుండి పారిపోతారు. వారందరినీ నీ చేతిక్రిందికి తీసుకొస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ధైర్యం కలిగి నిబ్బరంగా ఉండు. భయపడకు, బెంబేలుపడకు. దేవుడు నీతో ఉన్నాడు.
📖పరాక్రమశాలులారా, మీరు మహా బలవంతుడైన దేవునికి చెందినవాళ్ళు కాబట్టి మీరు పరాక్రమవంతులు. విజయాన్ని చేజిక్కించుకోండి.
యేసుప్రభువు సాధించిన విజయంలో మీకూ భాగం ఉండేలా చూసుకోండి. యేసు మనందరి కోసమూ, మనందరి తరపునా ఆ విజయాన్ని సాధించాడు. ఆయన విజయుడైనప్పుడు ఆయనలో, ఆయనతో మీరు ఉన్నారు. ఆ విజయాన్ని పోగొట్టుకోవద్దు.
మీ హక్కుల్ని వదలకండి. దోపుడు సొమ్మును పోగుచేసుకోండి. బలమైన కోట గోడలు మిమ్మల్ని ఆపలేవు. మీ సైన్యానికి ఓటమి అంటూ లేదు. మీ రక్షకుని విజయంలో పాలు పంచుకోండి.
మనం రాజకుమారులం. ఆ చక్రవర్తిని మనం మహిమపరచగలిగేదెలా?
మనకు ఆ రాజరికపు హక్కులు ఉన్నాయా, లేదా అని సందేహించడం ద్వారానా?
వాటిని స్వతంత్రించుకోకుండా వెనక్కు తగ్గడం ద్వారానా? కాదు,
👉 రాజకుమారుల్లాగా మన స్వాస్థ్యాన్ని, మన వారసత్వాన్ని నిలబెట్టుకోవడం ద్వారానే.