ఎడారిలో సెలయేర్లు - ఏప్రిల్ 28
ఇశ్రాయేలీయులు యెహోవాకు మొఱ్ఱపెట్టగా యెహోవా ‘కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును’ రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించి వారిని రక్షించెను. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను (న్యాయాధి 3:9,10).
తన యుద్ధశూరుల్ని దేవుడు సంసిద్ధపరుస్తున్నాడు. సరైన తరుణం వచ్చినప్పుడు కనురెప్పపాటులో వాళ్ళ స్థానంలో వాళ్ళని ఉంచుతాడు. “ఇతనెక్కడినుంచి వచ్చాడు!” అంటూ ప్రపంచమంతా ముక్కున వేలేసుకుంటుంది.
👉 స్నేహితుడా, పరిశుద్ధాత్మను నిన్ను సిద్ధపరచనియ్యి. క్రమశిక్షణ నేర్చుకో. పాలరాతి శిల్పానికి తుది మెరుగులు దిద్దాక దేవుడు దాన్ని ఎత్తి పీఠం మీద ప్రతిష్టిస్తాడు. దాన్నుంచవలసిన స్థానంలో అమరుస్తాడు.
📖ఒకరోజు వస్తుంది, ఒత్నీయేలు లాగానే మనం కూడా జాతులకి న్యాయాధిపతులుగా ఉంటాము. వెయ్యేళ్ళ పాటు భూమిపై క్రీస్తుతో కూడా అధికారం వహించి రాజ్యమేలుతాము. ఆ రోజును రుచి చూడాలంటే దేవుని ద్వారా మనం మలచబడాలి. మన అనుదిన జీవితంలో ఎదురయ్యే శ్రమలు, చిన్న చిన్న విజయాలు -వీటన్నిటి మూలంగా దేవుడు మనకి శిక్షణ ఇస్తున్నాడు. ఇది మనకి తెలియదు కాని ఒక్క విషయం గురించి మాత్రం సందేహం లేదు. పరిశుద్ధాత్మ ఆ అవసరానికి తగినట్టు ఒత్నీయేలును సిద్ధం చేసి ఉంచాడు. పరలోకపు రాజైన దేవుడు అతనికి ఓ సింహాసనాన్ని తయారుగా ఉంచాడు.
👉 మానవ బలము, మానవ ఘనత సుఖశాంతుల్లో చిగురించవు లోకంలో బాధలనెదుర్కోనివారు శూరులెన్నటికీ కాలేరు
మనిషి జీవిత యాత్రలో ఎప్పుడో ఒకప్పుడు పల్లపు ప్రాంతాల్లో నడవక తప్పదు. ప్రతివాడు బాధల సొరంగంలోగుండా వెళితేనే తప్ప విజయపు మెట్టు ఎక్కలేడు.